Rahul Gandhi congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. భారత్ జోడో యాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ.. యాత్రను మధ్యలో విడిచి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేది సెప్టంబర్ 20 కాగా.. అప్పటికి రాహుల్ యాత్ర కేరళలో ముగిసి కర్ణాటకకు చేరనుంది.
కాగా, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఎంపీ శశి థరూర్ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోకి మరొకరు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని పార్టీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. రాహుల్ గాంధీ పోటీ చేసే విషయమై ఆయనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
రాహుల్‌కు మద్దతు
మరోవైపు, పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవాలని హరియాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. "అందరి మనోభావాలను" పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు రాహుల్‌ను అభ్యర్థించారు. ఇదివరకే గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఇలాంటి తీర్మానాలను ఆమోదించాయి.
1998 నుంచి 2017 వరకు సుదీర్ఘ కాలం సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. 2017లో రాహుల్‌కు బాధ్యతలు అప్పగించినా.. 2019లో తప్పుకుని మళ్లీ సోనియాకే కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ సిద్ధమైంది. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.
ఇదీ చదవండి: థరూర్ X గహ్లోత్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో వీరి మధ్యే పోటీ!
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్!