Rahul Gandhi on Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిరంతరం పని చేస్తుందని ట్వీట్ చేశారు రాహుల్.
''ప్రజల తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తాం'' అని రాహుల్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
ప్రజా తీర్పునకు కట్టుబడి ఉన్నాం..
మినీ సార్వత్రికంగా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీ అంచనాలకు ఏ మాత్రం పొంతన లేకుండా వచ్చాయని కాంగ్రెస్ తెలిపింది. ఏదేమైనా ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల్లో అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తాము అంచనా వేయడంలో విఫలం అయినట్లు చెప్పారు. అందులోనూ పంజాబ్ ప్రజలు మార్పును కోరుకొని ఓటు వేశారని వివరించారు. తాము కేవలం ఎన్నికల్లోనే ఓడిపోయామని.. ధైర్యాన్ని కాదని అన్నారు. సరికొత్త వ్యూహాలతో మరోసారి బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీలా కాంగ్రెస్..
ఐదు రాష్ట్రాల ఫలితాలను చూస్తే.. ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ అన్నారు. తాజా ఫలితాల్లో పార్టీ పేలవమైన ప్రదర్శనను కనబరిచిందని చెప్పుకొచ్చారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయం సాధించిందని అన్నారు. ఈ విజయం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి:
ఉత్తరాఖండ్‌లో భాజపా నయా చరిత్ర.. మోదీ మేజిక్ రిపీట్!
ముంచారు.. మునిగారు... ముగ్గురి కుమ్ములాటతో కాంగ్రెస్ ఫసక్!
ఆ సెంటిమెంట్ మాత్రం మారలేదు.. పార్టీ గెలిచినా సీఎం ఓటమి
కీలక నేతలకు షాక్.. చన్నీ, సిద్ధూ, కెప్టెన్, బాదల్ ఓటమి