Rahul Gandhi News: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగంలో దేశాభివృద్ధిపై వ్యూహాత్మక దృష్టి లోపించిందని.. దేశంలో పేదలు, ధనికుల మధ్య పెరుగుతున్న అంతరం సహా ప్రధాన సమస్యల గురించి అసలు ప్రస్తావనే లేదని మండిపడ్డారు. బుధవారం లోక్సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"దురదృష్టవశాత్తు రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్రం తాము చర్యలు చేపడుతున్నామంటూ పేర్కొనే ఎన్నో అనవసర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ కీలకమైన వ్యూహాత్మక అంశాలపై సహా దేశంలోని ప్రధాన సమస్యలపై ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది కేవలం పలువురు బ్యూరోక్రెట్లు ఇచ్చే సలహాల జాబితాలాగా ఉంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
రెండు ఇండియాలు
రెండు ఇండియాల అంశంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. తన దృష్టిలో ప్రస్తుతం ఇండియాలు రెండు ఉన్నాయని.. ఒకటి పేదలకు.. మరొకటి ధనికులకు అని పేర్కొన్నారు. ఈ రెండు ఇండియాల మధ్య అంతరం పెరుగుతోందన్నారు.
40శాతం దేశ సంపద పలువురి ఖాతాల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. 84శాతం మంది భారతీయుల ఆదాయం క్షీణించిందని ఫలితంగా వారు పేదరికం అనుభవిస్తున్నారని తెలిపారు. 'మేక్ ఇన్ ఇండియా' అసాధ్యమని.. అసంఘటిత రంగం అంతరించిపోవడమే అందుకు కారణమని ఆరోపించారు.
భారత్ ఇప్పుడు ఏకాకి
సరిహద్దుల్లో మిత్రదేశాలు లేక భారత్ ఏకాకి అయిందని అన్నారు రాహుల్ గాంధీ. గణతంత్ర దినోత్సవానికి సరిహద్దు దేశాల నుంచి అతిథులు రాని పరిస్థితిపై కేంద్రం తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు.
"చైనీయులకు తాము చేసే విషయంపై స్పష్టత ఉంటుంది. దౌత్యపరంగా భారత్ ప్రధాన లక్ష్యం పాకిస్థాన్, చైనాలను దూరంగా ఉంచడం. కానీ మీరు వాటిని కలిపారు. ఇది మీరు చేసిన అతిపెద్ద నేరం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : 'బడ్జెట్లో పేదలకు శూన్యం.. అంతా ఆ కొందరు సంపన్నుల కోసమే!'