Rahul Gandhi Jesus : తమిళనాడుకు చెందిన వివాదాస్పద కేథలిక్ మత గరువు జార్జ్ పూనయ్యతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంభాషణ రాజకీయంగా దుమారం రేపింది. భారత్ జోడో యాత్ర పేరిట చేస్తున్న 150 రోజుల పాదయాత్రలో భాగంగా శుక్రవారం కన్యాకుమారి జిల్లా పులియూర్కురిచిలోని చర్చిలో పూనయ్యను కలిశారు రాహుల్. ఆ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్ వైరల్‌గా మారింది.
వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..
"ఏసు క్రీస్తు కూడా భగవంతుని రూపమే కదా? నిజమేనా?" అని జార్జ్ పూనయ్యను రాహుల్ అడిగారు. "ఆయనే(ఏసు క్రీస్తు) అసలైన దేవుడు. దేవుడు.. ఒక నిజమైన మనిషిలానే అవతరిస్తాడు. 'శక్తి'లా కాదు. అందుకే మనం మనిషినే చూస్తాం" అని బదులిచ్చారు పాస్టర్.
వివాదాస్పద పాస్టర్‌తో భేటీని భాజపా తప్పుబట్టింది. "మతదురభిమానంతో కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు ఆయన(జార్జ్ పూనయ్య) గతంలో అరెస్టయ్యారు. భారత్ తోడో(దేశాన్ని విడగొట్టే) శక్తులతో కలిసి భారత్ జోడో(భారత్‌ను ఐక్యం చేసే) యాత్ర చేస్తారా?" అని రాహుల్‌ను ప్రశ్నించారు భాజపా అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా.
అయితే.. ఈ విమర్శల్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆడియోకు, అక్కడ జరిగినదానికి ఏమాత్రం సంబంధం లేకుండా భాజపా దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది.
జార్జ్ పూనయ్య గతంలో అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, డీఎంకే మంత్రి, మరికొందరికి వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేసిన కేసులో గతేడాది జులైలో అరెస్టయ్యారు.