Rahul Gandhi ED: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం జరగాల్సిన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈడీకి లేఖ రాశారు. ఈ కేసులో రాహుల్ని ఇప్పటికే 3 రోజులపాటు దాదాపు 30 గంటలు ప్రశ్నించిన ఈడీ అధికారులు శుక్రవారం కూడా హాజరుకావాలని సమన్లు ఇచ్చారు.
రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్ సంబంధిత సమస్యలతో దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాహుల్, ఆయన సోదరి ప్రియాంకగాంధీ ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు. శుక్రవారం కూడా తాము హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరముందని అందుకే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాందీ.. ఈడీకి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
రాహుల్ విజ్ఞప్తికి ఈడీ ఓకే: తన తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోందని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలన్న రాహుల్ గాంధీ విజ్ఞప్తికి అంగీకరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈనెల 20న సోమవారం విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది.
ఇదీ కేసు..: నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2012లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: బుల్డోజర్లతో కూల్చివేతలు ఆపలేం.. కానీ...: సుప్రీంకోర్టు
దుస్తులు చించేశారని మహిళా ఎంపీ ఆరోపణ.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్