Rahul Gandhi on GST: కేంద్ర ప్రభుత్వం హోటల్ వసతి, ప్రీ-ప్యాక్డ్ ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను వసూలు చేయాలని బుధవారం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి 'గబ్బర్ సింగ్ ట్యాక్స్'గా ఉన్న జీఎస్‌టీ ఇప్పుడు 'గృహస్తీ సర్వనాశన్ ట్యాక్స్' (కుటుంబాలను సర్వనాశనం చేసే టాక్స్)గా రూపుచెందబోతోందని ఆరోపించారు. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార వస్తువులపైనా పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు.
'ఓవైపు తగ్గుతోన్న ఉపాధి, ఆదాయం.. మరోవైపు ద్రవ్యోల్బణం దెబ్బ. ఇలా ప్రధానమంత్రి గబ్బర్‌సింగ్ ట్యాక్స్ ఇప్పుడు కుటుంబాలను విధ్వంసం చేసే ట్యాక్స్‌గా మారబోతోంది' అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆహార ఉత్పత్తులు, విద్య, హోటల్ వసతి వంటివి ఇక మరింత ప్రియం కాబోతున్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వస్తు సేవల పన్ను విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతోన్న రాహుల్ గాంధీ.. ఇప్పటివరకు దాన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్‌టీ మండలి ఇటీవల సమావేశమైంది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులకు జీఎస్‌టీ మండలి ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి: