దేశంలో చమురు ధరలు, ప్రైవేటీకరణ అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశం ఏమైపోయినా సరే.. స్నేహితులకు లాభం చేకూర్చాలని మోదీ సంకల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం.. పెట్రోల్‌పై పన్నులు విధిస్తూ రూ.21లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 'కేంద్ర ప్రభుత్వం పట్టపగలే రెండు విధాలుగా ప్రజలను దోచుకుంటోంది. వాటిలో ఒకటి... గ్యాస్, డీజిల్, పెట్రోల్‌పై అధిక పన్నులు వసూలు చేయడం. రెండోది... ప్రభుత్వరంగ సంస్థలను స్నేహితులకు విక్రయించి.. ప్రజల భాగస్వామ్యం, ఉద్యోగాలు, సదుపాయాల్ని దూరం చేయడం. దేశం ఏమైపోయినా ఫర్వాలేదు. తన స్నేహితులకు లాభం చేకూర్చడమే ప్రధాని మోదీ సంకల్పం' అని ట్వీట్‌లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. గ్యాస్ సిలిండర్ ధర రూ.900కు చేరువలో ఉంది. దీంతో పెరుగుతున్న ధరలపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆన్‌లైన్ ఉద్యమం కూడా ప్రారంభించింది. 'స్పీక్ అప్ ఎగైనెస్ట్ ప్రైస్ రైజ్' పేరుతో నిర్వహిస్తోన్న ఈ ఉద్యమంలో ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.