ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. మోదీ తన ప్రత్యర్థులను అణచి వేసే ఓ బలమైన శత్రువు అని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటీషు వారిని వెనక్కి పంపించినట్లే ఈ దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని కూడా పదవి నుంచి దించుతారని తెలిపారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు.
మనం ఓ బలమైన శత్రువుతో పోరాడుతున్నాం. దేశంలోని డబ్బుపై ఆధిపత్యం చెలాయిస్తున్న శత్రువుతో మనం పోరాడుతున్నాం. తన ప్రత్యర్ధులను అణచివేస్తున్న శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాం. కానీ ఈ కొత్త శత్రువు కంటే కూడా చాలా పెద్ద శత్రువును మనం ఓడించాం. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 70ఏళ్ల క్రితం ఈ దేశాన్ని బ్రిటీష్ వారు పాలించారు. నరేంద్ర మోదీ కంటే బ్రిటీష్ వారు చాలా బలమైనవారు. భారతదేశ ప్రజలు బ్రిటీష్ పాలకులను వెనక్కి పంపించారు. అదే తరహాలో మనం నరేంద్ర మోదీని నాగ్‌పుర్(ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యాలయం)కు పంపిస్తాం.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. మోదీకి లొంగిపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజల కోసం కాకుండా మోదీ కోసం పళనిస్వామి పని చేస్తున్నారని ఆరోపించారు.
"తమిళనాడు ముఖ్యమంత్రికి ఒకవేళ అవినీతి చరిత్ర ఉన్నట్లయినా నేను పట్టించుకోను. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయన ఎందుకు నిల్చోలేకపోతున్నారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థుల చర్చల నుంచి వచ్చిన విధానాలనే విద్యావ్యవస్థలో పొందుపరుస్తామని రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ జేవియర్ కళాశాల ప్రొఫెసర్లతో రాహుల్ సంభాషించారు.