రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను పట్టపగలే.. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు లూటీ చేశారు. బ్యాంక్‌లోకి చొరబడి రూ.5 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారెనా పట్టణంలోని బుధవారం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోకి ఆరుగురు దుండగులు చొరబడ్డారు. తమ దగ్గర ఉన్న ఆయుధాలతో బ్యాంక్ ఉద్యోగులను బెదిరించి చోరీకి పాల్పడ్డారు. రూ.5 లక్షలు తీసుకుని పరారయ్యారు.
వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బ్యాంక్ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. దుండగులు పారిపోగా.. స్థానిక పోలీసులు వెంబడించారు. రాధేకాపురా గ్రామంలో పోలీసులు, దుండుగుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురి నిందితుల కాళ్లకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వారు ముగ్గురూ పోలీసులకు లొంగిపోయారు. మరో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు.
గాయపడిన ముగ్గురు దుండగులను జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో పోలీసులు చేర్పించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, రూ.1.40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.