పంజాబ్‌కు చెందిన విద్యా శాఖ మంత్రి హర్జోత్ బెయిన్స్, ఆ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్త్వరలో ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆనంద్‌పుర్ సాహిబ్‌లోనే పెళ్లి సంబరాలు
2019 బ్యాచ్‌కు చెందిన జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. హర్జోత్ బెయిన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్‌పుర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన.. ప్రస్తుతం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వీరి పెళ్లి ఈ నెలలోనే జరగనుంది. శ్రీఆనంద్ సాహిబ్‌లో వీరి పెళ్లి కార్యక్రమాలన్నీ జరగనున్నాయి. హర్జోత్ బెయిన్స్, జ్యోతి యాదవ్‌ల పెళ్లి పనుల హడావుడి ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.
రాజకీయ నాయకుల సందడి
యువ మంత్రి హర్జోత్ బెయిన్స్, జ్యోతి యాదవ్‌ల పెళ్లిలో ఆప్ నేతల సందడి అధికంగానే ఉండబోతుంది. చాలా మంది రాజకీయ వేత్తలు వీరి పెళ్లికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కేవలం పంజాబ్ మంత్రులే కాకుండా ఇతర రాజకీయ నాయకులు కూడా వీరి పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం. "మరికొద్ది రోజుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న జంటకు అభినందనలు" అని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్.. హర్జోత్ బెయిన్స్, జ్యోతి యాదవ్‌లకు తన విషెస్ తెలిపారు. ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వీరి వివాహానికి హాజరు కానున్నారు.
విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్
32 ఏళ్ల హర్జోత్ బెయిన్స్ స్వస్థలం ఆనంద్‌పుర్ సాహిబ్‌లోని గంభీర్‌పుర్ గ్రామం. ఈయన వృత్తిరీత్యా న్యాయవాది. 2014లో చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి తన బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) పూర్తి చేశాడు. 2017 ఎన్నికల్లో సాహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో సర్టిఫికేట్ కూడా పొందారు. బెయిన్స్ గతంలో పంజాబ్ ఆప్ యువజన విభాగానికి నాయకత్వం వహించారు. 2022లో పంజాబ్ రూప్‌నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బెయిన్స్... ప్రస్తుతం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
ఐపీఎస్ జ్యోతి యాదవ్
జ్యోతి యాదవ్ హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి. 2019 సర్వీసుకు చెందిన పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన యాదవ్ ప్రస్తుతం.. మాన్సా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం ఆప్ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చిన్నాతో జరిగిన వాదన తర్వాత ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.
ఇవీ చదవండి: