కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ''ఛలో దిల్లీ'' ర్యాలీలో పరిస్థితిని అదుపు చేయడంలో హరియాణా ప్రభుత్వం విఫలమైందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విమర్శించారు. విఫలమవడమే కాకుండా తిరిగి పంజాబ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ మేరకు అమరీందర్ శనివారం మీడియాతో మాట్లాడారు.
"నిరసన చేస్తున్న రైతులు నా మనుషులు కాబట్టి వారి వైపు నిలబడటం నా బాధ్యత. వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధర, మండీలు కోల్పోతామనే భయం వారిలో నెలకొంది. ఆ విషయంలో ప్రభుత్వం వారికి ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు? కనీస మద్దతు ధరపై కేంద్రం రైతులకు భరోసా ఇచ్చినప్పటికీ వారు చట్టబద్ధమైన హామీని కోరుతున్నారు."
---అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి.
ఖట్టర్ ఆరోపణలపై స్పందిస్తూ శాంతియుతంగా నిరసనలు చేయడానికి ర్యాలీగా వెళ్తున్న రైతులపై ఎందుకు భాష్ఫవాయువు ప్రయోగించారు? పరిస్థితిని అదుపు చేయడంలో ఖట్టర్ విఫలమవడమే కాకుండా పంజాబ్ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదు. పరిస్థితిని అదుపు చేయకపోగా రైతుల గ్రూపుల్లో అవాంఛనీయ శక్తులు ఉన్నాయని ఆరోపించడమేంటి? వారి నిరసనల వెనక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. కేవలం పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు మాత్రమే ఉన్నారు. మేం సమస్యకు పరిష్కారాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. మా రైతుల్ని బాధపెట్టాలని ఏ మాత్రం కోరుకోవడం లేదు. ఖట్టర్ రైతులకు క్షమాపణ చెప్పే వరకు నేను ఆయనతో మాట్లాడను' అని అమరీందర్ స్పష్టం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' నిరసన కార్యక్రమానికి పంజాబ్ ప్రభుత్వమే కారణమని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఆఫీస్ బేరర్లు ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి : రైతన్నలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: అమిత్ షా