బంగాల్లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న భాజపాకు సొంత కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. రాష్ట్రంలో మూడు, నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికలకు భాజపా రెండో విడతలో విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ కార్యకర్తలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టారు. పాతవారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హేస్టింగ్స్ భాజపా కార్యాలయం ముందు భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శన చేసిన కార్యకర్తలు.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, సీనియర్ నాయకుడు అర్జున్ సింగ్ను కార్యాలయంలోకి వెళ్లకుండానీయకుండా అడ్డుకున్నారు. పంచాలా, హూగ్లీ జిల్లాలోని సింగూర్ నియోజకవర్గం, దక్షిణ 24 పరగణాలులోని రైదిగి నియోజకవర్గం సహా పలు స్థానాల్లో కొత్తవారిని నామినేట్ చేయడంపై మండిపడ్డారు. పార్టీ నిర్ణయంపై కొందరు బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుదారులు.. నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'మమతా బెనర్జీ నామినేషన్ తిరస్కరించండి'