సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 'కిసాన్ మహా పంచాయత్' కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు 'సంయుక్త కిసాన్ మోర్చా' రైతు సంఘం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా మహా పంచాయత్‌ల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో.. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై స్పష్టత వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మరోమారు స్పష్టం చేసింది సంయుక్త కిసాన్ మోర్చా.
ఈ నెల 18న.. దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు 'రైల్ రోకో' నిర్వహించనున్నట్లు కిసాన్ మోర్చా తెలిపిన ఒక్కరోజు అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
"పలు ప్రాంతాల్లో మహా పంచాయత్ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్ మోదాబాద్లో, ఫిబ్రవరి 13న హరియాణాలోని బహదుర్గాలో, ఫిబ్రవరి 18,19,23 తేదీల్లో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్, హనుమాన్‌నగర్, సిల్కార్ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడతాం."
-దర్శన్ పాల్, రైతు సంఘం నాయకుడు.
ఈ నేపథ్యంలో.. హరియాణా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు దర్శన్ పాల్. రైతులు ఉద్యమం చేస్తోన్న టిక్రి సరిహద్దుల్లో ప్రభుత్వం సీసీటీవీలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తోందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి:'మేకులను తొలగించిన తర్వాతే దిల్లీని వీడతాం'