నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలకుపైగా దిల్లీ సరిహద్దులో ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు.. కుండ్లీ-మనేసర్-పల్వాల్(కేఎంపీ)/వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే, కుండ్లీ-గాజియాబాద్-పల్వాల్ హై వేలను దిగ్బంధించారు. సాగు చట్టాలు రద్దయ్యే వరకూ తమ పోరాటం ఆగదని మరోమారు తేల్చిచెప్పిన అన్నదాతలు.. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలను 24 గంటలపాటు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. అత్యవసర వాహనాలకు అనుమతినిస్తామని పేర్కొన్నారు.


"కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే, కుండ్లీ-గాజియాబాద్-పల్వాల్ హై వేలను దిగ్బంధించాం. 24గంటలపాటు ఈ బంద్ కొనసాగనుంది. ఈ సమయంలో కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని హరియాణా పోలీసులు కోరారు."
- హరీందర్ సింగ్ లఖోవాల్, భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
అయితే.. దిగ్బంధించిన ఎక్స్‌ప్రెస్ వేలలో.. శాంతిభద్రతలను కాపాడటం, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని అదనపు డెరెక్టర్ జనరల్(శాంతి భద్రతల విభాగం) తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజా రవాణాను సులభతరం చేసేందుకూ విస్తృత చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు.




జలియన్ వాలాబాగ్ హింసాత్మక ఘటన జరిగిన ఏప్రిల్ 13, అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న.. దిల్లీ సరిహద్దుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: బంగాల్లో ఎన్నికల వేళ బాంబుల కలకలం