మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి ఝార్ఖండ్‌లోని రాంచీలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వారు బుల్లెట్ గాయం కారణంగా చనిపోయినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ అల్లర్లలో భద్రతా బలగాలు సహా మరికొందరు గాయాలపాలైనట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 13 మంది ఆస్పత్రిలో చేరగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన భాజపా అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, బహిష్కృత నేత నవీన్ జిందాల్.. మహమ్మద్ ప్రవక్తపై ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం ఈ ఆందోళనలకు దారితీసింది.
శుక్రవారం ప్రార్థనల అనంతరం చేపట్టిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం సహా వాహనాలను ధ్వంసం చేసి, వాటికి నిప్పటించారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాళ్ల దాడిలో రాంచీ ఎస్ఎస్పీ సురేంద్ర కుమార్ కూడా గాయపడి ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.
సెక్షన్ 144 విధింపు: దాడులపై సత్వరమే స్పందించిన జిల్లా యంత్రాంగం రాంచీలోని హింసాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. శనివారం ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం దానిని జూన్ 12 ఉదయం వరకు పొడిగించింది. రాంచీలోని 12 ప్రాంతాల్లో సెక్షన్ 144ను అమలుచేస్తున్నారు అధికారులు. బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కొంత ఉద్రిక్తత నెలకొన్నా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు రాంచీ డీఐజీ అనీశ్ గుప్తా తెలిపారు.
హింసాత్మక ఘటనలకు నిరసగా శనివారం రాంచీలో బంద్ పాటించాలని పలు హిందుత్వ సంస్థలు వ్యాపారులకు పిలుపునిచ్చాయి. హింసను ఖండించిన రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్.. నిందితులపై కఠిన చర్యలను తీసుకోవాలని సీఎం హేమంత్ సోరేన్‌కు చెప్పారు.
దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ: ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తంచేసిన అనంతరం పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దిల్లీలోని చారిత్రక జామా మసీదు వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థన అనంతరం వెలుపలకు వచ్చి ప్రదర్శన నిర్వహించారు. బంగాల్లోని హావ్‌డా జిల్లాలో నిరసనకారులు రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లోనూ మసీదుల్లో ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శనలు జరిగాయి. కర్ణాటకలోని బెళగావిలో నిరసనకారులు నుపుర్ శర్మ దిష్టిబొమ్మను విద్యుత్ తీగలతో వేలాడతీయగా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దానిని తొలగించారు.
దిల్లీ పోలీస్ సీరియస్: అయితే జామా మసీదు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు దిల్లీ పోలీసులు. అనుమతి లేకుండా నిరసన చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ ఒక్క సంస్థ పేరునూ పోలీసులు ప్రస్తావించలేదు.
జామా మసీదు షాహి ఇమామ్ కానీ, మసీదు కమిటీ కానీ కేసు పెట్టలేదని వెల్లడించారు సెంట్రల్ జోన్ డీసీపీ. జామా మసీదు వద్ద జరిగిన నిరసన ఏ ఒక్క సంస్థ ముందస్తు పథకం ప్రకారం చేసిందని భావించడం లేదని తెలిపారు. మొత్తం ఘటనపై విచారణ ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
227 మంది అరెస్టు: హింసాత్మక ఘటనలకు సంబంధించి యూపీలోని పలు జిల్లాల్లో 227 మందిని అరెస్టు చేసిన ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు.. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు