స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకం ఎగరేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath)ను అనుమతించేది లేదంటూ ఖలిస్థానీ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(Sikhs for Justice) హెచ్చరికలు చేసింది. ఈ మేరకు 59 సెకన్ల నిడివితో ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ నెంబర్ నుంచి వచ్చిన ఈ మెసేజ్‌ను యూపీ పోలీసులు గుర్తించారు. సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గుర్‌పట్వంత్ సింగ్ పన్నుమ్(Gurpatwant Singh Pannun) ఈ బెదిరింపు సందేశం పంపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
"భాజపా, ఆరెస్సెస్, ప్రధాని మోదీ.. రైతులకు వ్యతిరేకం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వారికి మద్దతు ఇస్తున్నారు. యూపీ ప్రజలు, రైతులు.. రాష్ట్ర ప్రభుత్వం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలి."
-ఆడియోలోని వ్యాఖ్యలు
అంతేకాకుండా.. ఉత్తర్‌ప్రదేశ్ పశ్చిమాన ఉన్న సహరాన్‌పుర్ నుంచి రాంపుర్ వరకు ప్రాంతాన్ని ఖలిస్థానీలు తమ హస్తగతం చేసుకుంటారని ఆడియోలో పేర్కొన్నట్లు సమాచారం. తాండ, హర్దువాగంజ్, పంకి, పరిచ్ఛా సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థర్మల్ ప్లాంట్లు నిలిచిపోయేలా చేస్తానని గుర్‌పట్వంత్ హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు
ఆడియో గురించి దిల్లీ నుంచి సమాచారం అందిందని లఖ్‌నవూ పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే లఖ్‌నవూలో కేసు నమోదు చేయలేదని వివరించారు.
ఆగస్టు 3న ఇదే తరహా బెదిరింపులు హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్‌కూ వచ్చాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జాతీయ జెండా ఎగరేయకుండా చూస్తామంటూ బెదిరింపులు వచ్చాయని సీఎం ఠాకూర్ స్వయంగా వెల్లడించారు. పలువురు జర్నలిస్టులు, విపక్ష నేతలకూ ఇలాంటి వార్నిగ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: వరదల ధాటికి కుప్పకూలిన రెండంతస్తుల భవనం