లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Kheri Incident) ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సుమారు 50 గంటల సుదీర్ఘ విరామం తరువాత పోలీసులు అనుమతించారు. దీంతో ప్రియాంక, రాహుల్ ఇరువురు కలిసి చనిపోయిన రైతుల కుటుంబాలను కలుసుకున్నారు. అయితే ప్రియాంక నిర్బంధంలో ఉన్న సమయంలో ప్రియాంకను కలిసేందుకు తనను పోలీసులు అనుమతించలేదని ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. ఈ మేరకు ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మరణించిన కుటుంబాలకు సంతాపాన్ని తెలిపేందుకు ప్రియాంక ఆదివారం లఖ్నవూ చేరుకున్నారు. అక్కడ వర్షం పడుతోందని, లఖింపుర్ ఖేరి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుందని ఆమె నాకు సమాచారం అందించారు. అయితే కొద్దిసేపటికే పోలీసులు తనని పట్టుకొని తోయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలను టీవీలో చూశాను. బాధిత కుటుంబాలకు సంతాపం తెలపడం అనేది ప్రభుత్వానికి పెద్దసమస్య కాదు. కానీ వారు అమెకు అనుమతించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
-రాబర్ట్ వాద్రా, ప్రియాంక భర్త
నిర్బంధంలో ఉంచిన ప్రియాంక గాంధీ.. బాధిత కుటుంబాలను కలుసుకున్న తరువాతే తిరిగి వస్తానని చెప్పినట్లు ఆమె భర్త రాబర్ట్ వాద్రా తెలిపారు.
ప్రియాంకను చాలా అపరిశుభ్రంగా ఉన్న గదిలో నిర్బంధించారు. ఆమె గది వెలుపల డ్రోన్‌లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో నేను ఆమెను కలవడానికి వెళ్లాలనుకున్నాను. అయితే అప్పుడే ప్రియాంకను విడుదల చేసిన సమాచారం అందింది. సమయానికి రాహుల్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రియాంక మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించిన తరువాతే తిరిగి వస్తాను అని చెప్పింది.
- రాబర్ట్ వాద్రా, ప్రియాంక భర్త
ఉత్తర్ప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని రాబర్ట్ వాద్రా అన్నారు. తప్పు చేసిన అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు బయట బాగా తిరుగుతున్నారని... బాధితులను పరామార్శించేందుకు వెళ్లిన వారిపై మాత్రం పోలీసులు దారుణంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. రాజకీయ నాయకులనే ఇలా వేధిస్తుంటే.. ఇక సమాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చూస్తే.. ఉత్తర్ప్రదేశ్లో నియంతృత్వ పాలన నడుస్తున్నట్లు అర్థం అవుతుందని వాద్రా విమర్శించారు.
తమ కుటుంబం రైతన్నల, బాధితుల వైపున నిలబడుతుందని రాబర్ట్ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు తమ కుటుంబ సభ్యులను ఎంత అణిచివేయాలని చూసినా.. మా ప్రయత్నాలు మాత్రం ఆగవని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:
లఖింపుర్ ఖేరిలో రాహుల్, ప్రియాంక.. బాధిత కుటుంబానికి పరామర్శ