ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం సుమారు 3:30 సమయంలో ఆమె కన్నుమూశారని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ బులెటిన్‌లో వెల్లడించింది. ఆమె ఆరోగ్య విషమించడం వల్ల బుధవారమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మోదీ హుటాహుటిన దిల్లీ నుంచి గుజరాత్ వెళ్లి.. గంటకు పైగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రిలోని వైద్యులతో తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. అయితే గురువారం ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని మోదీ సోదరుడు సోమాభాయ్ తెలిపారు. గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆమెకు నివాళులు తెలిపిన ఆయన అనంతరం తల్లి హీరాబెన్ పాడె మోశారు. గాంధీనగర్‌లోని సెక్టార్ 30లో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తల్లి మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్
తల్లి మరణంపై ప్రధాని మోదీ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. "నూరేళ్లు పూర్తిచేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరింది నా తల్లి. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది" అని కొనియాడారు. ఈ క్రమంలోనే ఆయన అహ్మదాబాద్‌కు పయనమయ్యారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బంగాల్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సమాచారం.
ప్రముఖుల సంతాపం
హీరాబెన్ మోదీ మృతి పట్ల పలువురు సంతాపం తెెలిపారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్‌తో పాటు రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి అమిత్ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ.. ఈ ఏడాది జూన్‌లో వందో వడిలోకి అడుగుపెట్టారు. ఆమె ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్ నగరానికి సమీపంలోని రేసన్ గ్రామంలో నివసించేవారు. ప్రధానమంత్రి తన గుజరాత్ పర్యటనలలో చాలా వరకు రైసన్‌ని క్రమం తప్పకుండా సందర్శించి, తన తల్లితో గడిపేవారు. 1923 జూన్ 18న ఆమె జన్మించారు. హీరాబెన్ పుట్టినరోజున.. ప్రధాని మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. దాదాపు అరగంట పాటు మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.