దిల్లీ కరియప్ప మైదానంలో జరిగిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పరేడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. ఎన్సీసీ చేస్తోన్న సేవలను కొనియాడారు.
"వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు దేశానికి సేవ చేయడంలో ముందున్నారు. కరోనా సమయంలో లక్షలాది మంది కేడెట్లు అధికార యంత్రాంగానికి, సమాజానికి ఎంతో సహాయపడ్డారు.
సమాజంలో ఎన్సీసీ పాత్రను ప్రభుత్వం ఇంకా విస్తరించాలనుకుంటోంది. సరిహద్దు, తీర ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ఎన్సీసీని మరింత శక్తిమంతం చేస్తాం."
- నరేంద్ర మోదీ, ప్రధాని
దేశంలోని సరిహద్దు, తీర ప్రాంతాల్లోని 175 జిల్లాల్లో ఎన్సీసీకి కొత్త బాధ్యతలు అప్పగిస్తామని గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించినట్లు మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం లక్ష మంది కేడెట్లకు సైన్యం, వాయుసేన, నేవీ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడింట ఒకవంతు మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు.