గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా దేశంలోని ఆదివాసీలకు చాలా నష్టం కల్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోంలోని శివపురలో 1.06 లక్షల మంది భూమి లేని దేశీయ అసోమీలకు భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినా అసోంలోని లక్షలాది మంది ఆదివాసీలు, దేశీయ అసోమీలు భూమిపై యాజమాన్య హక్కులు పొందలేకపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అనుసరించిన విధానాల కారణంగా ఆదివాసీల పరిస్ధితి ఎలా ఉండేదో నా కంటే ఎక్కువగా మీకే(ఆదివాసీలకే) తెలుసు. ఇప్పుడు ఆదివాసీలకు ఇల్లు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తున్నాం. అనేక ఆదివాసీ కుటుంబాలకు ఇప్పుడు భూమిపై చట్టబద్ధమైన అధికారం లభించింది. ఆదివాసీల పిల్లలకు విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నాం. ఆదివాసీలను మొదటి సారి బ్యాంకింగ్ సౌకర్యంతో అనుసంధానించాం. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాల ప్రయోజనం వారికి ఇప్పుడు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరుతోంది.
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
భూమిపై హక్కులు ఆదివాసీలకు గౌరవం, స్వాతంత్య్రం, భద్రతపై భరోసా కల్పిస్తాయని మోదీ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకూ అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు.