రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీచేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. రాష్ట్రాలు ప్రతిరంగంలోని ఖాళీలను గుర్తించి వాటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ప్రతి రాష్ట్రం తన బలాలను గుర్తించాలని.. అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని సాధించడానికి రోడ్‌మ్యాప్ తయారుచేసుకోవాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడానికి ఇది అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
"ఈ సదస్సులో జరిగిన చర్చలు వివిధ రంగాల్లో పురోగతికి అవసరమైన రోడ్‌మ్యాప్ రూపొందించడానికి ఉపయోగపడతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీం ఇండియాగా పనిచేయాలి. ఈ సమావేశంలో ఖరారు చేసిన యాక్షన్ పాయింట్లు, తాజా ఆలోచనలను జాప్యం చేయకుండా అమలుచేయాలి. ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్నచిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేసే పనిని యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. రాష్ట్రాలు ప్రభుత్వం, స్థానిక సంస్థల కోసం చేపట్టే కొనుగోళ్ల కోసం జెమ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలి. అత్యవసర మందుల రవాణా, కొండప్రాంతాల పండ్ల ఉత్పత్తుల రవాణాకు డ్రోన్లను ఉపయోగించాలి. దానివల్ల రైతులు పండించే పంటలు, సేవా ఉత్పత్తులకు విలువను జోడించినట్లవుతుంది. జాతీయ విద్యా విధానంలో పొందుపరిచిన లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలలతో జోడించాలి. మున్సిపాలిటీల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. భవిష్యత్తు అభివృద్ధి, ఉపాధి కల్పనకు పట్టణప్రాంతాలు కీలకం. అందువల్ల పట్టణస్థానిక సంస్థలను బలోపేతంచేయాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎం గతిశక్తిని తగిన విధంగా అమలుచేయాలి. అన్ని ప్రభుత్వ పథకాల్లో సాంకేతిక వినియోగాన్నిపెంచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డేటాబేస్‌ను పరస్పరం వాడుకొనే వెసులుబాటు కల్పించాలి. పనిచేయడం (పర్‌ఫామ్), సంస్కరించడం (రీఫామ్), రూపాంతరం చెందడం (ట్రాన్స్‌ఫామ్) ప్రస్తుతం అత్యవసరం." - నరేంద్రమోదీ, ప్రధాని
సదస్సు చివరి రోజైన శుక్రవారం ఉన్నత విద్యలో నాణ్యత పెంచడం, మున్సిపాలిటీల ఆర్థికబలాన్ని పెంచి పట్టణ పరిపాలనను మరింత సమర్థంగా తీర్చిదిద్దడంపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, వివిధ కేంద్ర ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: