అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విరాళం అందించారు. విశ్వహిందూ పరిషత్ నేతల ఆధ్వర్యంలో శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బృందం రాష్ట్రపతితో సమావేశమై విరాళం కోసం అభ్యర్థించగా.. కోవింద్ రూ.5,00,100లను చెక్కు రూపంలో అందజేశారు. మందిర నిర్మాణం సజావుగా సాగాలని రాష్ట్రపతి ఆశీర్వదించారని వీహెచ్పీ నేతలు తెలిపారు. రాష్ట్రపతిగా కాకుండా వ్యక్తిగతంగానే విరాళం అందించినట్లు కోవింద్ తెలిపారని వెల్లడించారు.
"అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విరాళం అందించారు. ఆయన దేశ ప్రథమ పౌరుడు. అందుకే.. ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాలని కలిశాం. ఈ క్రమంలో రూ.5,00,100లు విరాళంగా ఇచ్చారు. "
- అలోక్ కుమార్, వీహెచ్పీ
ఇటీవల కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళం సేకరించడం ఇదే తొలిసారి. 60వ దశకంలో గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మందిర నిర్మాణం కోసం అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ విరాళం ఇవ్వగా దాని తర్వాత ఇదే తొలిసారి.
ఫిబ్రవరి 27 వరకు..
రామమందిర నిర్మాణం కోసం వీహెచ్పీ, శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రక్రియ కొనసాగించనుంది. ప్రధానమంత్రి సహా దేశంలోని ప్రముఖుల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు. దేశంలోని అయిదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరిస్తారు. విరాళాల సేకరణ పారదర్శకత ఉండేలా టోకెన్లు రూపొందించారు. రూ.2వేలకు పైగా విరాళం అందించే వారికి రశీదు అందిస్తారు. విదేశీ విరాళాలను సేకరించరాదని ఇప్పటికే నిర్ణయించారు. విరాళాల సేకరణ కోసం రూ.10 కూపన్లు 4 కోట్లు, రూ.100 కూపన్లు 8 కోట్లు, రూ.1000 కూపన్లు 12 లక్షలు ముద్రించింది ట్రస్ట్
ఇదీ చూడండి: అట్టహాసంగా పలమేడు జల్లికట్టు పోటీలు