President kovind bangladesh visit: మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నారు. ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకకు భారత్ తరఫున గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా కోవింద్‌ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానించారు. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మంగళవారం తెలిపారు.
"బంగ్లాదేశ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం వెళ్లనున్నారు. డిసెంబరు 15 నుంచి 17 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. రాష్ట్రపతితో పాటు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్, ఎంపీ రాజ్‌దీప్ రాయ్ కూడా వెళ్లనున్నారు."
-హర్షవర్ధన్ శ్రింగ్లా, విదేశాంగ కార్యదర్శి
Bangladesh vijay diwas: "రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ పర్యటన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలను 2021లో జరుపుకుంటోంది. ఇది భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య 50 ఏళ్ల దౌత్య సంబంధాలకు సాక్ష్యం. 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ బలగాలు సాధించిన విజయానికి గుర్తు" అని శ్రింగ్లా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత రాష్ట్రపతి చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదేనని.. ఇది భారత్, బంగ్లా మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని చెప్పారు.
పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని శ్రింగ్లా తెలిపారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్తోనూ రాష్ట్రపతి భేటీ అవుతారని చెప్పారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఐరాసలో వాతావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్
ఇదీ చూడండి: 'పేదరికంలోకి 50 కోట్లకుపైగా ప్రజలు- ఇక సమయం లేదు!'