మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్ను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు రమేశ్. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సైతం కొత్త గవర్నర్‌ను నియమించారు రాష్ట్రపతి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు.
వీటితో పాటు అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు ముర్ము. మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివ్ ప్రతాప్‌లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు ముర్ము.
మణిపుర్ గవర్నర్‌గా ఉన్న లా గణేశన్‌ను బదిలీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆయనను నాగాలాండ్ గవర్నర్‌గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను మేఘాలయా గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను.. బిహార్ గవర్నర్‌గా బదిలీ చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తేదీ నుంచి వీరి నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ పేర్కొంది.