దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ సిద్ధమవుతోందని తెలిపారు. వచ్చే ఏడాది వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు.
గుజరాత్ రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన మోదీ... కరోనాకు మందు(చికిత్స, టీకా) అందుబాటులోకి వచ్చినా నిర్లక్ష్యం తగదని సూచించారు.
"కరోనాకు మందు వచ్చే వరకు నిర్లక్ష్యం వద్దు అని ఇదివరకు పిలుపునిచ్చాను. కానీ, మందు వచ్చినా నిర్లక్ష్యం వహించవద్దని ఇప్పుడు చెబుతున్నాను. 2021 ఏడాదికి మన మంత్రం ఇదే."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణం వల్ల రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని అన్నారు మోదీ. దేశవ్యాప్తంగా గత ఆరేళ్లలో 10 ఎయిమ్స్‌ల నిర్మాణాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. 20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు భారత్ కేంద్రబిందువుగా అవతరించిందని ప్రధాని ఉద్ఘాటించారు. 2020 ఏడాదంతా సవాళ్లమయమేనని అన్నారు మోదీ. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే సందేశాన్ని ఈ ఏడాది తెలియజేసిందని పేర్కొన్నారు. 2021లో వైద్యసంరక్షణ రంగంలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన వల్ల పేద ప్రజలకు గణనీయంగా మేలు కలిగిందని అన్నారు. రూ. 30 వేల కోట్ల పేదల సొమ్ము ఆదా అయిందని చెప్పారు.
వదంతులతో జాగ్రత్త
వదంతుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మోదీ. టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మరిన్ని అసత్య వార్తలు ప్రచారమవుతాయని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలను తనిఖీ చేయకుండా ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.