కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ఉన్న గర్భిణీని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా.. కత్తి, బ్లేడు బయటపడ్డాయని వివరించారు.
అసాధారణ కదలికలతో..
గర్భిణీ అయిన ఉమాదేవి ఏప్రిల్ 8న తెల్లవారుజామున 5:20 గంటలకు నలుగురు కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె అసోం రాజధాని గువాహటికి ప్రయాణించాల్సి ఉంది. అయితే తనిఖీలు నిర్వహిస్తోన్న అధికారులు ఆమె ఎడమ కాలులో అసాధారణ వస్తువు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని తనిఖీలు నిర్వహించగా పదునైన కత్తితో పాటు.. బ్లేడ్, నెయిల్ కట్టర్, మోకాలిపై కాగితం కట్టర్ ఉన్నట్లు గమనించారు. వెంటనే ఆమెను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
విమానం కాక్‌పిట్ దగ్గరగా ఆమె సీటును బుక్ చేసుకుందన్న విషయం పోలీసులకు తెలిసి.. గర్భిణీకి సంబంధించిన ఇతర సామాగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.
అయితే వారి తెగ ఆచారం ప్రకారం.. గర్భిణీలు కడుపు చుట్టూ లోహ వస్తువులను చుట్టుకుంటారని వివరించింది ఉమాదేవి. కడుపు చుట్టూ కట్టుకోవడం కష్టంగా ఉండటం వల్లే కాలికి కట్టుకున్నట్టు పేర్కొంది. చికిత్స కోసం బెంగళూరుకు వచ్చినట్టు వివరించింది.
ఇవీ చదవండి: మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు