అతను పొట్టివాడే కానీ చాలా గట్టి సంకల్పం కలవాడు. అందుకే అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచింది. పేదరికం ఓడిపోయింది. తనలోని బలహీనతను తలుచుకుని బాధపడుకుండా.. వ్యాయామంపై ఆసక్తి కనబరిచి.. తన శరీరాన్ని దృఢపరుచుకున్నాడు. వైకల్యాన్ని అధిగమించి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచంలోనే అతి పొట్టి బాడీబిల్డర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. అతనే మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ విఠల్ మోహితే.
మూడు అడుగుల 4 అంగుళాల మోహితే.. ఖలాపుర్ తాలూకాలోని డోలవలికి చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆది నుంచి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంతో కష్టపడి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే బాడీబిల్డింగ్‌పై ఆసక్తితో వ్యాయామంపై దృష్టిసారించాడు మోహితే. 2016లో బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొని.. విఫలమయ్యాడు. దీంతో మరింత శ్రమించి.. జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ బరిలోకి దిగి.. రాయ్‌గఢ్ భూషణ్ అవార్డు అందుకున్నాడు.
అనంతరం.. 2021 సెప్టెంబరు 16న ప్రతీక్ మోహితే.. ప్రపంచంలోనే అతి పొట్టి బాడీబిల్డర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో సెప్టెంబరు 25న స్థానిక ఎమ్మెల్యే మహేంద్ర తోర్వే.. ప్రతీక్‌కు సన్మానసభ ఏర్పాటు చేసి అభినందించారు.
మహారాష్ట్ర బెల్దార్ భత్క్యా సమాజ్ ఫౌండేషన్‌కు చెందిన రాజ్ సాలుంఖే సాయంతో.. 2021లో మిస్టర్ ఇండియా పోటీలో కూడా మోహితే పాల్గొన్నాడు.
ఇదీ చూడండి: గంగా నదిలో వదిలితే.. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?