Prashant Kishor Congress: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో భాజపా పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘోర ఓటమి తప్పదని అన్నారు. ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్తోనే కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు పీకే.
''ఉదయ్‌పుర్ చింతన్ శిబిర్ గురించి మాట్లాడాలని నన్ను పదే పదే అడుగుతున్నారు. నా అభిప్రాయంలో.. దీంతో(చింతన్ శిబిర్తో) పార్టీకి వచ్చిందేమీ లేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల ఓటమి వరకు కాంగ్రెస్ అధినాయకత్వానికి సమయం ఇవ్వడం, యథాతథ స్థితిని మరికొంత కాలం కొనసాగించడానికి తప్ప అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించడంలో ఆ శిబిరం విఫలమైంది.'' అని ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్.
వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో ఇటీవల మూడు రోజుల 'చింతన్ శిబిర్' నిర్వహించింది కాంగ్రెస్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నవ సంకల్ప చింతన శిబిరం నిర్వహించింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ఈ శిబిరంలో ప్రసంగించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించేలా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు.
ఈ శిబిరానికి కొద్ది వారాల ముందే కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. పీకేను.. కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్‌కు 'నాయకత్వం' అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ చింతన్ శివిర్‌పై పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల సంకేతాలిచ్చిన ప్రశాంత్ కిశోర్ మే 5న కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ పెట్టట్లేదని స్పష్టం చేశారు. రాబోయే 3-4 నెలల్లో.. రాష్ట్రానికి చెందిన 17- 18 వేల మంది ప్రముఖుల్ని కలిసి మాట్లాడనున్నట్లు వివరించారు పీకే. బిహార్‌లో మంచి పరిపాలన(జన్ సురాజ్) కోసం.. వారి నుంచి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు.
2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో.. భాజపా అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. బిహార్, ఆంధ్రప్రదేశ్, బంగాల్‌లోనూ ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో కృషిచేశారు పీకే.
ఇవీ చూడండి: 'షార్ట్కట్లు లేవు.. పోరాడదాం.. తుదిశ్వాస వరకు మీతో ఉంటా!'