సరాదాగా చేసిన ఫేస్బుక్ 'ప్రాంక్' ఓ పసికందు సహా ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన కేరళలో జరిగింది.
ఇదీ జరిగింది..
జనవరిలో ఓ పసికందు.. కొల్లం జిల్లాలోని ఓ ప్రాంతంలో చెట్ల పొదల్లో ఏడుస్తూ కనిపించింది. ఆ చిన్నారిని రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పసికందు తల్లి కల్లువత్తుక్కల్ గ్రామానికి చెందిన రేష్మ అని గుర్తించారు. జూన్‌లో ఆమెను ఆరెస్టు చేశారు.
చిన్నారిని పొదల్లో వదిలేయటానికి రేష్మ చెప్పిన కారణం విని పోలీసులు కంగుతిన్నారు. భర్తను, కుటుంబాన్ని వదిలేసి.. ఫేస్బుక్లో పరిచయమైన ఆనందు అనే వ్యక్తిని పెళ్లాడేందుకే ఇలా చేసినట్లు ఆమె వెల్లడించింది. అయితే... అప్పటివరకు తను ఆనందును చూడలేదని చెప్పింది. దీంతో ఆనందు ఫేస్బుక్ ఖాతా వివరాలను పోలీసులు వెలికితీశారు.
మరో కీలక ట్విస్ట్..
దర్యాప్తులో భాగంగా.. రేష్మ వదిన ఆర్య, మేనకోడలు గ్రీష్మను పోలీసులు ప్రశ్నించారు. అనూహ్యంగా.. కొన్ని రోజుల తర్వాత ఆర్య, గ్రీష్మ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అసలు నిజం తెలిసిందిలా..
ఆర్య, గ్రీష్మ ఆత్మహత్యతో ఈ కేసు మరింత సంక్లిష్టమైంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ ముమ్మర దర్యాప్తు సాగించారు. గ్రీష్మకు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ప్రశ్నించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం... గ్రీష్మ, ఆర్య ఇద్దరు కలిసి తమ బంధువు రేష్మను ఆట పట్టించేందుకు ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతాను రూపొందించారు. ఆనందు అనే కల్పిత పాత్రను అడ్డం పెట్టుకుని రేష్మతో ప్రేమ డ్రామా సాగించారు. ఈ సంగతి తెలియని రేష్మ... ఫేస్బుక్ ప్రేమలో మునిగితేలింది. నిజ జీవితంలో ఎక్కడా లేని 'ఫేస్బుక్ ఫ్రెండ్ ఆనందు' కోసం కన్నబిడ్డను, కుటుంబాన్నే వదులుకుంది.
అంతా రహస్యం...
రేష్మ ఫేస్బుక్ 'ప్రేమ ప్రాంక్' వలలో పడిన సమయంలో ఆమె భర్త విష్ణు విదేశాల్లో ఉన్నాడు. రేష్మ గర్భవతి అయిన సంగతి, బిడ్డ పుట్టిన విషయం అతడి గానీ, ఇతర కుటుంబసభ్యులకు గానీ తెలియదు. ప్రసవం అయిన విషయాన్నీ రహస్యంగా ఉంచింది. ఆ బిడ్డనే పొదల్లో పడేసింది.
విదేశాల్లో ఉన్న రేష్మ భర్త విష్ణు.. భార్య అరెస్టు వార్త తెలియగానే స్వదేశానికి తిరిగివచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే కచ్చితంగా పరిస్థితి ఇంత దూరం రాకుండా చూసుకునేవాడినని వాపోయాడు.
ప్రస్తుతం రేష్మ జుడీషియల్ కస్టడీలో ఉంది. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినందున ఆమెను జైలు అధికారులు క్వారంటైన్లో ఉంచారు.
ఇదీ చదవండి:'ప్రాంక్' వేటలో.. ప్రాణాలు కోల్పోయి..!