ఒడిశాలో రష్యా టూరిస్టుల మృతిపై కీలక విషయాలు బయటకొచ్చాయి. రష్యా చట్టసభ్యుడు, వితరణశీలి పావెల్ ఆంటోవ్.. శరీరంలో తగిలిన అంతర్గత గాయాల కారణంగానే చనిపోయినట్లు శవపరీక్షల ద్వారా తెలిసింది. వ్లాదిమిర్ బుదానోవ్ మాత్రం గుండెపోటుతో చనిపోయారని పోస్టుమార్టం నివేదిక సృష్టం చేసింది. రాయగడ జిల్లా ఆసుపత్రిలో వీరి మృతదేహాలకు శవపరీక్షలు జరిగాయి. చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అధ్వర్యంలో బుధవారం ఈ పరీక్షలను నిర్వహించారు.
"బుదానోవ్ శరీర అవయవాలను భద్రపరిచాం. ఆంటోవ్ శరీర అవయవాలను మాత్రం భద్రపరచబడలేదు. భద్రపరిచిన శరీర అవయవాలను భువనేశ్వర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపుతాం. శవపరీక్షల నివేదికను పోలీసులకు అందజేశాం."
-చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లాల్మోహన్ రౌత్రాయ్
"పావెల్ ఆంటోవ్, వ్లాదిమిర్ బుదానోవ్ల శవపరీక్షల నివేదికలు మాకు అందాయి. పావెల్ ఆంటోవ్.. మూడో ఫ్లోర్ నుంచి కిందపడ్డ కారణంగా అతని శరీర లోపలి భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన మృతి చెందారు. వ్లాదిమిర్ బుదానోవ్ మాత్రం గుండెపోటు కారణంగానే చనిపోయారు" అని పోలీసులు తెలిపారు.
పావెల్ తన 66వ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకునేందుకు ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి వచ్చారు. డిసెంబర్ పావెల్, వ్లాదిమిర్ సహా నలుగురు రష్యన్లు డిసెంబర్ 21న రాయగడలోని హోటల్లో దిగారు. ఈ హోటల్‌కు వచ్చే ముందు.. ప్రముఖ పర్యటక ప్రదేశమైన కందామల్ జిల్లాలోని దారింగ్బాడీని వీరంతా సందర్శించారు. కాగా, డిసెంబర్ 25న పావెల్ రాయగడ జిల్లాలోని ఓ హోటల్లో.. మూడో ఫ్లోర్‌లోని తన గది కిటికీ నుంచి కింద పడి మరణించారు. పావెల్ మృతికి మూడు రోజుల ముందు ఆయన పార్టీకే చెందిన వ్లాదిమిర్ బుదానోవ్(61) అనే రష్యన్ నేత, అదే హోటల్లో గుండెపోటుతో చనిపోయారు.
రష్యాకు చెందిన పావెల్ ఆంటోవ్ ఓ కుబేరుడు. వ్లాదిమిర్ స్టాండర్డ్ అనే మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఆయన నెలకోల్పారు. రష్యన్ చట్టసభ సభ్యులలో అత్యంత ధనవంతులైన వారిలో పావెల్ ఒకరు. 2019లో, ఫోర్బ్స్ ఆయన సంపదను దాదాపు 140 మిలియన్ల డాలర్లుగా లెక్కగట్టింది.