దేశంలో ఏటా సుమారు 5లక్షల రోడ్డుప్రమాదాలు జరుగుతుంటాయి. అందులో చాలామంది ఎముకలు విరిగిపోతుంటాయి. అలాగే.. వయసు మీద పడటం, అరుదైన వ్యాధులు సోకడం వల్ల ఎముకల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటి వారందరికీ.. వాటి స్థానంలో ఇంప్లాంట్స్ అమర్చుతారు. మన దేశంలో ఎక్కువమంది టైటానియమ్ ఇంప్లాంట్స్ ఉపయోగిస్తున్నారు.
టైటానియమ్ ఇంప్లాంట్స్ విదేశాల నుంచి దిగుమతి చేస్తుండటంతో.. వాటి ధర సుమారు రూ.15 లక్షలుగా ఉంటోంది. వాటిని మెటల్‌తో తయారు చేయడం వల్ల.. ఎముక మాదిరి సరిగ్గా పని చేయవు. అందుకే కొన్ని సంవత్సరాలకే వాటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా తమిళనాడులోని వీఐటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గీతా ఆధ్వర్యంలో పెర్లిన్ హామిద్, అన్షీద్, ఆశ్విన్, జిషీతలు పరిశోధనలు జరిపారు.
ఎముకల్లా పనిచేసే ఇంప్లాంట్స్
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంప్లాంట్స్ కాకుండా ఎముకలలాగే పని చేసే ఇంప్లాంట్స్ అమర్చితే మరింత ప్రయోజనం ఉంటుందన్నది వైద్యనిపుణుల అభిప్రాయం. ఆ తరహా ఇంప్లాంట్స్ ఎక్కువకాలం ఉపయోగించవచ్చు. మరి ఆ ఆవిష్కరణ దేశంలో చేయలేమా..? ఈ ప్రశ్నకు సమాధానమే.. పోరస్ గైరాయిడ్ ఇంప్లాంట్స్(Porous Gyroid Implant).
ఈ ఆవిష్కరణను టాటా మెటిరీయల్ నెక్ట్స్2.0 కాంపీటేషన్‌లో ఉంచగా.. దాదాపు 300 ప్రయోగాల్లో దీనికే మొదటి బహుమతి లభించింది.
పేటెంట్ కోసం యత్నాలు..
పోరస్ గైరాయిడ్ ఇంప్లాంట్స్ ఉత్పత్తికి టాటా కంపెనీ ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఈ ఆవిష్కరణపై టాటా, వీఐటీ యూనివర్సిటీలు పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. పోరస్ గైరాయిడ్ ఇంప్లాంట్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. ఇదివరకులా ఇంప్లాంట్స్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో... అప్పటికప్పుడే తగిన పరిమాణంలో తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: లీటర్ పెట్రోల్ దొంగతనం చేస్తుండగా చూశాడని హత్య