రజీఖ్ ఉల్లా.. కర్ణాటక దావణగెరె జిల్లా హరిహర మండలం మాలేబెన్నూర్ వాసి. పేద ఇంట్లో పుట్టిన అతడు.. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. తాపీ పని చేస్తూనే చదివి.. ఎంఏ ఇంగ్లిష్లో యూనివర్సిటీ టాపర్గా నిలవడం, రెండు గోల్డ్ మెడల్స్ సంపాదించడమే ఇందుకు కారణం.
![poor student success story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15027767_razeeq.jpeg)
తండ్రి కష్టం చూడలేక..: జమాల్దీన్ సాబ్-షకీలా బాను దంపతుల కుమారుడు రజీఖ్ ఉల్లా. జమాల్దీన్ తాపీ పనిచేసే ఓ సాధారణ కూలీ. అతడు రోజంతా కష్టపడినా ఇంట్లోని ఆరుగురు సభ్యుల పోషణకు ఇబ్బందే. తండ్రి కష్టాన్ని చూడలేకపోయిన రజీఖ్.. తాను కూడా పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజంతా తాపీ పని చేస్తూ సంపాదించడం ప్రారంభించాడు. అయితే.. చదువుపై ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు. అందుకే కూలీ పని చేస్తూ విద్యాభ్యాసం కొనసాగించాడు. ఎంఏ ఇంగ్లిష్లో చేరాడు.
3 రోజులే పాఠాలు: వారంలో మూడు రోజులు మాత్రమే కళాశాలకు వెళ్లి పాఠాలు వినేవాడు రజీఖ్. మిగిలిన నాలుగు రోజులు తాపీ పనికి వెళ్లేవాడు. అతడి కష్టాన్ని చూసి దావణగెరె విశ్వవిద్యాలయం అధ్యాపకులు, తోటి విద్యార్థులు సహకరించారు. రజీఖ్ శ్రమ ఫలించింది. అతడు యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. రెండు గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. రజీఖ్ విజయగాథ తెలుసుకున్న వారంతా అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవల హరిహర మండలానికి వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. రజీఖ్ను సన్మానించారు.
![poor student success story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15027767_razeeq2.jpg)