పుదుచ్చేరిలో ప్రభుత్వ పతనంతో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా ఆసక్తి చూపడం లేదన్న వార్తలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళి సై ఎలా వ్యవహరిస్తారన్న దానిపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ప్రభుత్వం కూలిపోయే సరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ క్రీయాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, శాసనసభను రద్దు చేయడం వంటి ప్రత్యామ్నాయాలు తమిళిసై ముందు ఉన్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషించారు. వీటిలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
పరస్పర విమర్శలు..
పుదుచ్చేరిలో ప్రభుత్వ పతనంపై కాంగ్రెస్-భాజపా పరస్పర ఆరోపణలకు దిగాయి. ప్రభుత్వం కూలిపోవడానికి భాజపానే కారణమని కాంగ్రెస్ విమర్శించింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హస్తం పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. పుదుచ్చేరిలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని. కాంగ్రెస్ నేత దినేష్ గుండు రావు విమర్శించారు. సీబీఐ, ఈడీలతో ఎమ్మెల్యేలను భాజపా బెదిరించిందని ఆరోపించారు.
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్తారని గుండురావు వెల్లడించారు. కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఖండించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్న ప్రశ్నకు లెప్టినెంట్ గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి : భారత గగనతలం మీదుగా ఇమ్రాన్ విమానం