Political Review in Mehbubnagar : పాలమూరు జిల్లాలో ఎవరు గెలుస్తారనే అంశం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మారుతున్న రాజకీయ పరిణామాలు ఎవరికి అనుకూలిస్తాయో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు(Palamuru Politics) జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలుండగా.. గత ఎన్నికల్లో కొల్లాపూర్ మినహా అన్నింటా బీఆర్ఎస్ గెలిచింది. కొల్లాపూర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది.
Telangana Assembly Elections 2023 : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించాలని గులాబీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అందరి కంటే ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్ధులుగా ప్రకటించిన బీఆర్ఎస్(BRS).. ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రజా ఆశీర్వాద సభలతో ముఖ్యమంత్రి సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. పాలమూరు దుస్థితికి కారణం కాంగ్రెస్సే అంటూ విమర్శిస్తున్న కేసీఆర్... రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Congress Campaign in Palamuru : కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం పార్టీ పదునైన వ్యూహాలతో ముందుకెళుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుటోంది. బీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కని వాళ్లు, టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు.. కాంగ్రెస్‌లో చేరారు. అలా చేరిన జూపల్లి కృష్ణారావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, గద్వాల జెడ్పీ ఛైర్‌పర్సన్ సరిత, మేఘారెడ్డి, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైన నేతలకు పార్టీ టిక్కెట్లు కేటాయించింది.
టిక్కెట్టు దక్కని నాయకుల్ని బుజ్జగించి కలపుకుని పోయే ప్రయత్నం చేసింది. పాత,కొత్త నేతల కలయిక ఆ పార్టీలో కొత్త జోష్‌ని నింపింది. ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను అస్త్రాలుగా మలచుకుని కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. బీజేపీ విడతల వారీగా అభ్యర్ధులను ప్రకటించింది. బీఎస్పీ సైతం కొన్ని నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించి బరిలో నిలిచింది.
ప్రధాన పార్టీల అభ్యర్ధుల ప్రకటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పార్టీ ఫిరాయింపులకు తెరతీశాయి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఇన్నేళ్లూ సేవలందించిన పార్టీని వదలి ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోయారు. తెలుగుదేశం నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఇబ్రహీం, సీనియర్ బీసీ నేత కాటం ప్రదీప్ గౌడ్, గద్వాలలో డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్ లాంటి సీనియర్లు బీఆర్ఎస్ గూటికి చేరారు. నేతల పార్టీ ఫిరాయింపులు పాలమూరులో రాజకీయ పరిణామాల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తున్నాయి.
BJP Campaign in Palamuru : పాలమూరు జిల్లాలో బలపడిన బీసీ వాదం ప్రస్తుత రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, జడ్చర్ల, నారాయణపేటల్లో బలమైన సామాజిక వర్గమైన బీసీలకు టిక్కెట్లు కేటాయించకపోవడమే కీలక నేతల పార్టీ మార్పులకు పరోక్ష కారణమైంది. గద్వాల రాజకీయాల్లో డీకే కుటుంబం పోటీకి దూరంగా ఉంటడానికి కారణం బీసీనినాదమే. ఈసారి బీసీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా డీకే అరుణ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రత్యేక ప్యాకేజీలు, అధికారంలోకి వస్తే పదవులు, ఆపద వస్తే అండగా ఉంటామంటూ హామీలిచ్చి మరీ బలమైన నేతలను అక్కున చేర్చుకుంటున్నాయి..
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. పాలమూరు జిల్లాలో ముంబయి, పూణె, బీవండి, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలకు పొట్టకూటి కోసం లక్షలాది మంది వలస వెళ్లారు. వలస జీవుల మనసులు గెలిచేందుకు ఆక్కడే అభ్యర్ధులు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. బలమైన సామాజిక వర్గాలు, బీసీ, ఎస్సీ, ఏస్టీ, మైనారిటీలు, మహిళలు, యువకుల్ని ఆకట్టుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన సమస్యలైన సాగునీరు, ఉపాధి, నిరుద్యోగం లాంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి, మహిళా సాధికారత లాంటి అంశాలపై పార్టీల పనితీరును ఓటర్లు అంచనా వేయనున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కానున్నాయి.
దశాబ్దాలుగా పాలమూరు ఓటర్ల తీర్పు విభిన్నం. విలక్షణం. నమ్మితే ఆ నాయకున్ని ఎన్నిసార్లైనా గెలిపిస్తారు. వద్దనుకుంటే మార్చేందుకు ఏ మాత్రం వెనకాడరు. అందుకే పాలమూరు జిల్లాలో వరుసగా ఐదారు సార్లు గెలిచిన నేతలూ ఉన్నారు. వరుస విజయాలు దక్కని నాయకులూ ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ వరుస విజయానికి జై కొడతారా.. మార్పునకు శ్రీకారం చుడతారో వేచి చూడాల్సిందే.