UP election 2022: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పరిణామాలు రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార పక్షానికి షాకిస్తూ భాజపా ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్న వేళ... అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తులు ముమ్మరం చేసింది. తొలి మూడు దశలకు జరిగే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తోంది. అటు, మిగిలిన పార్టీలు సైతం ఈ రేసులో వేగంగా ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది.
UP election candidate selection:
తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న 172 అసెంబ్లీ స్థానాలకు భాజపా తన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక స్థితిగతులను, అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకొని జాబితాను రూపొందించినట్లు సమాచారం.
బరిలోకి యోగి..
Yogi Adityanath seat UP election: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన్ను ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని భాజపా అధిష్ఠానం యోచిస్తోంది. గోరఖ్‌పుర్ నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన యోగిని.. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నుంచి పోటీకి దింపాలని కమలదళం భావిస్తోంది.
- ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌లను శాసనసభకు పంపాలని యోచన.
- సిరాథూ స్థానం నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య, లఖ్‌నవూలోని ఓ నియోజకవర్గానికి దినేశ్ శర్మ పోటీ పడే అవకాశం.
ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే జాబితాను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి ఈసారి టికెట్ లభించే అవకాశం లేదని సమాచారం.
మహిళల ఓట్లపై కాంగ్రెస్ కన్ను!
Congress UP election candidate list: అటు, కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసింది. తొలి నుంచీ 'మహిళా సాధికారత'పై ఆధారపడిన కాంగ్రెస్.. టికెట్ల కేటాయింపులోనూ వారికే పెద్దపీట వేసింది. మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం స్థానాలను రిజర్వ్ చేసి సరికొత్త సమీకరణాలతో ప్రయోగాలు చేస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్త, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి, తమ హక్కుల కోసం గళమెత్తిన ఆశా వర్కర్.. ఇలా వివిధ సామాజిక అంశాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తులకు సీట్లు కేటాయించి సానుభూతి పొందాలని భావిస్తోంది.
UP election candidate list 2022
- 125 మంది పేర్లతో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- 50 సీట్లు మహిళలు, 40 స్థానాలు యువకులకు కేటాయింపు
ఇది చారిత్రక నిర్ణయమని, దీంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చెప్పుకొచ్చారు. 125 మంది జాబితాలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ సైతం ఉన్నారని ప్రియాంక వెల్లడించారు. గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్ పూనమ్ పాండే షాజహాన్‌పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడిన వ్యక్తులకే కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇచ్చినట్లు తెలిపారు. మహిళలను ప్రత్యేకమైన ఓటు బ్యాంకుగా భావించడం లేదని అన్నారు. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు.. రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
గెలిపించిన వ్యూహాన్ని నమ్ముకొని..
BSP UP Election 2022: ఈ ఎన్నికల ప్రచారంలో కాస్త డీలా పడ్డట్టు కనిపిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఇప్పటికే 300 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. 90 మంది దళితులకు అవకాశం కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్ర తెలిపారు. భాజపా, సమాజ్‌వాదీ పార్టీలకు తమ అభ్యర్థులపై విశ్వాసం లేదని, అందుకే జాబితాలను ఇంకా విడుదల చేయలేదని ఆరోపించారు. రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
BSP candidate list UP polls:
- గంగోహ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ సోదరుడు నోమన్ మసూద్ పోటీ
- చర్తవాల్ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి కుమారుడు సల్మాన్ సయీద్
- మాయావతి పుట్టిన రోజు అయిన జనవరి 15న పూర్తి జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
దళితులు- బ్రాహ్మణులను ఏకం చేసి...
దళితులు- బ్రాహ్మణులకు సమప్రాధాన్యం ఇస్తూ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. 2007లో బీఎస్పీని అధికారంలోకి తెచ్చేందుకు ఈ ఫార్ములానే దోహదం చేసింది. అందుకే ఈ ఎన్నికల్లోనూ అదే అనుసరించాలని మాయావతి నిర్ణయించారు. బ్రాహ్మణ సామాజిక వర్గంపై పట్టున్న మిశ్ర.. ఇప్పటికే 90 నియోజకవర్గాల్లో పర్యటించారు. దళితులు, బ్రాహ్మణుల మధ్య సయోధ్య కుదిరేలా పావులు కదుపుతున్నారు. ముస్లింలపైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ జనాభా ముఖచిత్రం
- దళితులు- 20 శాతం
- ముస్లింలు- 20 శాతం
- బ్రాహ్మణులు- 13 శాతం
29 మందితో ఎస్పీ-ఆర్ఎల్డీ జాబితా
సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి తొలి విడతలో పోటీ చేయనున్న 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 10 స్థానాల నుంచి సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేయనుండగా.. ఆర్ఎల్డీ తరపున 19 మంది బరిలోకి దిగనున్నారు.
ఎస్పీతో ఎన్సీపీ జట్టు..
మరోవైపు, సమాజ్‌వాదీతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒక సీటుపై ఏకాభిప్రాయం కుదిరిందని, మరికొన్ని సీట్లలో పోటీ చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలోకి రాబోయే కూటమికే తాము మద్దతిస్తున్నట్లు చెప్పారు.
తొలి విడతలో వీటి చుట్టే లెక్కలు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. పశ్చిమ యూపీలోని 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. రైతుల ఉద్యమం ఉద్ధృతంగా సాగిన ముజఫర్‌పుర్ వంటి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ తొలివారంలో ఇక్కడ రైతులు భారీ మహాపంచాయత్ నిర్వహించారు. గత ఎన్నికల్లో ఈ 58 స్థానాల్లో భాజపా 53 చోట్ల గెలుపొందింది. ఎస్పీ, బీఎస్పీ రెండు స్థానాల చొప్పున గెలుచుకున్నాయి.
మథురలో కృష్ణుడి మందిరం, చెరకు మద్దతు ధర, మతపరమైన అల్లర్లు- శాంతి భద్రతలు వంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. తమ పాలనలో పశ్చిమ యూపీలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, వలసలు తగ్గాయని భాజపా చెప్పుకుంటోంది. చెరకు రైతుల బకాయిలను వెంటనే చెల్లించామని చెబుతోంది. మతపరమైన అల్లర్లకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని, 2017 తర్వాత యూపీలో ఒక్క మతపరమైన ఘర్షణ జరగలేదని చెబుతోంది.
2013లో జరిగిన ముజఫర్‌పుర్ అల్లర్ల తర్వాత పశ్చిమ యూపీలో సమాజ్‌వాదీ డీలా పడింది. అయితే, ఇటీవల భాజపా నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు రావడం తమకు కలిసొస్తుందని భావిస్తోంది.
కీలక స్థానాలు
- అలీగఢ్- దివంగత ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ సొంత జిల్లా
- మథుర- కృష్ణుడి జన్మస్థలం
ఇదీ చదవండి: