అధికార పీఠమెక్కాలంటే 'ఆమె' అండ కావాలి! ఎన్నికల్లో పోటీకి మాత్రం 'ఆమె' పనికి రాదు! ఇదీ.. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు. ఆ రాష్ట్రాల్లో మహిళా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు పార్టీలు పోటాపోటీగా తాయిలాలు ప్రకటిస్తున్నాయి. చట్టసభల్లో వారికి సముచిత ప్రాధాన్యం దక్కేలా టికెట్లు కేటాయించడంలో మాత్రం వెనకంజ వేస్తున్నాయి.
తృణమూల్ కాస్త మెరుగు
మహిళలకు టికెట్ల కేటాయింపులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కాస్త మెరుగ్గా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో 50 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం టికెట్లలో వారి కోటా 17 శాతం.
ఇదీ చదవండి: భాజపా బంగాల్ మేనిఫెస్టో: మహిళలకు 33% రిజర్వేషన్
భారీగా మహిళా ఓటర్లు
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అతివల సంఖ్య భారీగా ఉంది. కేరళలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 8.27 లక్షలు ఎక్కువ. ఆ రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో మహిళలు 52% ఉన్నారు. తమిళనాడులోనూ వారి వాటా సగానికి పైమాటే (50.3%). అస్సాం, బెంగాల్‌లలో మహిళా ఓటర్లు వరుసగా 49.3%, 49% ఉన్నారు. వారి ఓట్లను దక్కించుకునేందుకుగాను పార్టీలు.. గృహిణులకు వేతనాలు, స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు రుణాలు, పింఛను వంటి ఘనమైన తాయిలాలను ఇప్పటికే ప్రకటించాయి.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌లో వెట్టి కార్మికుల్లా మహిళలు'
టికెట్ల కేటాయింపులో మాత్రం వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. భాజపా, కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎంకే సహా దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో.. విజయం సాధించే సత్తా ఉన్న అభ్యర్థులుగా మహిళలను పార్టీలు పరిగణించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ను ఖరారు చేస్తేనే, పరిస్థితుల్లో మార్పు వస్తుందని సూచిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (17%) మినహా అన్ని పార్టీలూ తాజా ఎన్నికల్లో అతివలకు 10% కంటే తక్కువగానే సీట్లు కేటాయించాయి.
ఇదీ చదవండి: 'భాజపాతో అభివృద్ధి- కాంగ్రెస్‌తో చొరబాట్లు'