నందిగ్రామ్‌లో బంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులకు తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ సుఫియాన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
కోల్‌కతాలోని ఏఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో దీదీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాలికి గాయమవడం రాజకీయ వివాదానికి దారితీసింది. కుట్రపూరితంగానే మమతపై దాడికి పాల్పడ్డారని టీఎంసీ వాదిస్తుండగా.. సానుభూతి కోసం మమత ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని భాజపా విమర్శిస్తోంది.
'ఇలాంటి డ్రామాలను చూసేశారు'
నందిగ్రామ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని భాజపా బంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన డ్రామానా కాదా అన్నది తేలుతుందని ఘోష్ అన్నారు. ఇంతకు ముందు కూడా ఈ తరహా డ్రామాలను బెంగాలీలు చూశారని చెప్పారు. ఇప్పుడు వాస్తవాలు తెలియాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
దీదీ ప్రవర్తన పట్ల అక్కడి వారు కోపంగా ఉన్నారని.. నిజానికి అదో ప్రమాదం అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారని భాజపా ట్విట్టర్‌లో పేర్కొంది. మమత కారులోకి ఎక్కకముందే డ్రైవర్ కారును ముందుకు పోనివ్వడం వల్ల గాయమై ఉండొచ్చని భాజపా విశ్లేషించింది.
అది హాస్యాస్పదం..
దాడి, కుట్ర, హత్యాయత్నం వంటి పేర్లతో సానుభూతి పొందాలని మమత భావిస్తున్నారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఈ దాడి జరిగినప్పుడు తన వెంట పోలీసులు ఎవరూ లేరని చెప్పడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, సీసీటీవీ రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
నిజాలు నిగ్గుతేలాలి: టీఎంసీ
మమతా బెనర్జీకీ రక్షణ కల్పించడంలో ఎన్నికల సంఘం(ఈసీ) విఫలమైందని టీఎంసీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. భాజపా నేతల ఆదేశాలకు అనుగుణంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించింది. మమతా బెనర్జీపై దాడి జరిగే అవకాశాలున్నాయని తెలిసినప్పటికీ.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పార్థ ఛటర్జీ, దెరేక్ ఓబ్రెయిన్, చంద్రిమా భట్టాచార్య ఈసీని కలిసి దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు.
"బంగాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు వరకు శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. డీజీపీని ఈసీ తొలగించిన తర్వాతి రోజే.. మమతపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఈసీనే బాధ్యత వహించాలి."
-పార్థ చఠర్జీ , టీఎంసీ నేత
మమతపై దాడిని టీఎంసీ నేత దెరేక్ ఓబ్రెయిన్ ఖండించారు. ఈ ఘటన వెనక ఉన్న నిజాలు తేలాలని డిమాండ్ చేశారు.
"మార్చి 9న డీజీపీని ఈసీ మార్చింది. మార్చి 10న దీదీపై దాడి జరిగింది. ఓ భాజపా ఎంపీ 5 గంటల తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందని తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో చెప్పారు. అనంతరం 6 గంటలకు మమతపై దాడి జరిగింది. ఇలాంటి ఘటనలను మేం ఖండిస్తున్నాం. దీని వెనక ఉన్న నిజం ఏంటో బయటకు రావాలి."
-దెరేక్ ఓబ్రెయిన్, టీఎంసీ నేత
పరామర్శించేందుకు భాజపా నేతలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతను పరామర్శించేందుకు భాజపా నేతలు తథాగథ్ రాయ్, శామిక్ భట్టాచార్య.. ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి వెళ్లారు. కానీ, వైద్యాధికారుల సూచనలతో ఆమెను వారు కలుసుకోలేపోయారు. అయితే.. అరూప్ విశ్వాస్ను కలిసిన వారు.. దీదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:'దీదీకి తీవ్ర గాయాలు- ఎముకలో పగులు'