నేడు దేశవ్యాప్తంగా రైతులు రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. 'చక్కా జామ్' పేరిట రహదారుల దిగ్బంధం చేపట్టనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇవాళ కూడా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
దిల్లీ-ఎన్సీఆర్ సరిహద్దుల్లో దాదాపు 50 వేల మంది పోలీసు, పారామిలిటరీ, రిజర్వు బలగాలను మోహరించింది కేంద్రం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పటిష్ఠం చేసింది.
మెట్రో హైఅలర్ట్..
దేశ రాజధానిలోని దాదాపు 12 మెట్రో స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలపై నిరంతరం దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇనుప కంచెలు, బారికేడ్లు..
ఈ నేపథ్యంలోనే దిల్లీ-గాజీపుర్- ఎన్సీఆర్ సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసనకారులను నియంత్రించేందుకు బారికేడ్లు, పెద్ద పెద్ద ఇనుమ కంచెలు, నీళ్ల ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకున్నారు.
ఎర్ర కోట వద్ద కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు.
జనవరి 26న ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన ఐటీఓ ప్రాంతం వద్ద కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: చక్కా జామ్: భద్రతా వలయంలో దేశ రాజధాని