మధ్యప్రదేశ్ బేతుల్‌లో వారం రోజుల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చింద్వాఢాకు చెందిన ప్రిన్స్ సోని (25) అనే వ్యక్తి ఈ చోరీలో ప్రధాన నిందితుడని ఎస్పీ సిమలా ప్రసాద్ తెలిపారు. సోని, అతని ముఠా మే 31న రూ.2.5 లక్షల నగదు, విలువైన ఐదు వజ్రాలను దోచుకున్నట్లు వెల్లడించారు.
దొరికారిలా..
సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఝార్ఖండ్‌కు చెందిన కరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అంతేగాక అతడిచ్చిన సమాచారం మేరకు.. సైఖేదా, పింటు నాగ్లే, శుభం గైక్వాడ్, పంకజ్ కావ్డే, హృతిక్ చంద్రహాస్, రోహిత్ మార్కంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.55 లక్షలు విలువైన ఆభరణాలతో పాటు.. ఐదు మేలిమి వజ్రాలు, 250 డైమండ్లు, 2 నాటు తుపాకులు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వజ్రాలను ఔషధాలలో(క్యాప్సూల్స్) దాచి ఉంచారని ఎస్పీ వివరించారు.
ఇవీ చదవండి: 'రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్వేర్, రూ.15 లక్షలు చోరీ'