కాలుష్య భూతానికి దేశ రాజధాని దిల్లీ వణుకుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాలుష్య కారకాల్లో ప్రమాదకరమైన 'పీఎం2.5' ధూళిరేణువులు గత ఏడాది దిల్లీలో 54వేల మంది మృతికి కారణమైనట్లు తాజా పరిశోధన వెల్లడించింది. రాజధాని నగరంలో గాలి కాలుష్య తీవ్రత వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిని అంచనా వేసేందుకు గ్రీన్‌పీస్ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
దిల్లీ నగరంలో పలు సందర్భాల్లో కాలుష్య తీవ్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు గ్రీస్‌పీస్ నివేదిక వెల్లడించింది. కాలుష్య కారకాల్లో ప్రమాదకరమైనదిగా పరిగణించే పీఎం2.5 వల్ల దిల్లీ నగరంలో ప్రతి పదిలక్షల మంది జనాభాలో 1800 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించింది. భారత్‌లోని ఇతర నగరాల్లోనూ ఇదే తరహా ప్రభావం ఉన్నట్లు గ్రీస్‌పీస్ అధ్యయనం అభిప్రాయపడింది. గాలి కాలుష్యం వల్ల గతఏడాది ముంబయిలో 25వేల మరణాలు సంభవించాయని అంచనా వేసింది. ఇక బెంగళూరులో 12వేల మంది, చెన్నైలో 11వేలు, హైదరాబాద్‌లో 11వేలు, లఖ్‌నవూ నగరంలో 6700 మంది కాలుష్య కారకాల వల్ల ప్రాణాలు కోల్పోయారని అంచనా వేసింది. అయితే, పలు ముందుజాగ్రత్త చర్యల వల్ల ఈ మరణాలను నివారించే వీలుందని గ్రీన్‌పీస్ అధ్యయనం స్పష్టం చేసింది.
ఐదు నగరాల్లోనే 1,60,000 మంది బలి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఏడాదిలో సరాసరి (10μg/m3) కంటే దిల్లీలో ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్య స్థాయిలు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీని వల్ల రూ.58,895కోట్ల రూపాయల విలువైన ఆర్థికనష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. ఇది దిల్లీ జీడీపీలో దాదాపు 13శాతమని నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దిల్లీ, మెక్సికో, సావోపౌలో, షాంఘై, టోక్యో నగరాల్లోనే గతేడాది దాదాపు లక్షా 60వేల మంది పీఎం2.5కు బలైనట్లు తెలిపింది. ఇక వాతావరణంలో అతి ప్రమాదకర కణాల్లో ఒకటైన పీఎం2.5 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 42లక్షల(2015 సంవత్సరంలో) అకాల మరణాలకు కారణమయినట్లు గ్రీన్‌పీస్ నివేదిక వెల్లడించింది.
'కరోనా విజృంభణ కారణంగా గతేడాది ప్రపంచ వ్యాప్తంగా ఆయాదేశాలు లాక్‌డౌన్‌లో వెళ్లాయి. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే, ఇది తాత్కాలికమేనని, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కాలుష్యం వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది' అని గ్రీన్‌పీస్ ఇండియా ప్రతినిధి అవినాష్ చంచల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభణ వేళ దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే శిలాజ ఇంధనాలకు బదులు క్లీన్ ఎనర్జీ వాడకం వల్ల కాన్సర్, గుండె, శ్వాసకోస సమస్యల వంటి ప్రమాదకర జబ్బుల వల్ల కలిగే మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని తాజా నివేదిక సూచించింది.
ఇదిలా ఉంటే, గాలి కాలుష్య ప్రభావంతో సంభవిస్తోన్న అకాల మరణాలు, అనారోగ్యం కారణంగా 2019లో భారత్‌కు రూ.రెండున్నర లక్షల (రూ.2,60,000)కోట్ల నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.4శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2019లో భారత్‌లో దాదాపు 17లక్షల మరణాలు వాయు కాలుష్యం ప్రభావంతోనే సంభవించినట్లు గతేడాది విడుదలైన లాన్సెట్ నివేదిక పేర్కొంది.
ఇదీ చూడండి: స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!