గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించిన 'ఈ-ప్రాపర్టీ' కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వామిత్వ' పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీటిని లబ్ధిదారులకు అందజేస్తారు. వర్చువల్గా ఈ కార్యక్రమం జరగనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
'జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 4.09 లక్షల మందికి ఈ- ప్రాపర్టీ కార్డులు అందనున్నాయి. ఈ ఏడాదికి సంబంధించిన జాతీయ పంచాయతీ పురస్కారాలను కూడా ప్రధాని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజేతలకు ప్రదానం చేయనున్నారు. వివిధ విభాగాల కింద ఈ అవార్డులు పొందిన వారికి రూ. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు నగదు బహుమతిని వారి ఖాతాల్లో జమ చేస్తారని' పీఎంఓ వెల్లడించింది.
కోట్లాది మందికి..
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది పౌరులకు ఈ పథకం ద్వారా సాధికారత కల్పించనుంది కేంద్రం. గ్రామస్తులు వారి భూములను ఆర్థిక ఆస్తులుగా పరిగణించి రుణాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది.
'స్వామిత్వ' అనేది కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధీనంలోని పథకం. దీనిని ఈ ఏడాది గతేడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రారంభించారు. ఈ పథకాన్ని నాలుగేళ్ల కాలంలో దశల వారీగా దేశమంతటా అమలు చేయనున్నారు. 2024 వరకు దేశంలోని దాదాపుగా 6.62 లక్షల గ్రామాల్లో ప్రాపర్టీ కార్డులను అందజేస్తారు
ఇదీ చూడండి: 'అధికార మార్పిడి కాదు.. అభివృద్ధే లక్ష్యం'