ఫ్రంట్లైన్ వర్కర్లకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 26 రాష్ట్రాల్లో 111 శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. లక్షకుపైగా కొవిడ్ వారియర్లకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి కౌశల్ వికాశ్ యోజన 3.0 కింద రూ.276 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
హోంకేర్, బేసిక్ కేర్, అడ్వాన్సుడ్ కేర్, ఎమర్జెన్సీ కేర్, శాంపిల్ కలెక్షన్ సహా మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ విభాగాల్లో కొవిడ్ వారియర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
బంగాల్లో కొవిడ్ ఆస్పత్రులు..
పీఎం కేర్స్ నిధుల నుంచి రూ.41.62 కోట్లతో బంగాల్లో రెండు 250 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. డీఆర్డీఓ ఆధ్వర్యంలో ముర్షీదాబాద్, కల్యాణి ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నట్లు వెల్లడించింది. పీఎం కేర్స్ నిధులతో ఇప్పటికే బిహార్, దిల్లీ, జమ్ము, శ్రీనగర్లో కొవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని పేర్కొంది.
ఇదీ చదవండి : PM Modi: 'అప్పటికి 6.42కోట్ల ఎకరాలు సారవంతం'