PM security breach: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్ పర్యటనను ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ప్రధాని పర్యటనల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా.. పిటిషన్ కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సూచించింది సుప్రీం కోర్టు. పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
ప్రధాని నరేంద్రమోదీ ఫిరోజ్‌పుర్ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మెహ్‌తాబ్, న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాగ్‌వర్మ ఈ దర్యాప్తు బృందంలో ఉన్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కమిటీ 3రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
కార్యకర్తలను అడ్డుకున్నారు: భాజపా
ప్రధాని మోదీ హజరయ్యే ఫిరోజ్‌పుర్ సభకు కార్యకర్తలు హాజరవకుండా అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు భాజపా పంజాబ్ అధ్యక్షుడు అశ్వినీ శర్మ. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్న బస్సులు, ఇతర వాహనాలను సభాస్థలికి చేరకుండా అడ్డుకున్నారని తెలిపారు. మరోవైపు.. ఫిరోజ్‌పుర్, కతునంగల్, హారికే, కోట్కాపురా, తల్వాండి వంటి 21ప్రాంతాల్లో ఆందోళనకారులు భాజపా కార్యకర్తల వాహనాలకు అడ్డుపడినట్లు చెప్పారు. వారు ప్రభుత్వ మద్దతుతోనే ఇలా చేశారని ఆరోపించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
గవర్నర్‌కు ఫిర్యాదు..
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది అశ్వినీ శర్మ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల భాజపా బృందం. రాజ్‌భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించింది.
వివాదం దురదృష్టకరం: మాజీ ప్రధాని
ప్రధానమంత్రి భద్రత విషయంపై వివాదం చెలరేగటం చాలా దురదృష్టకరమన్నారు మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవే గౌడ. దేశ అత్యున్నత వ్యక్తుల భద్రత అంశంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అంశాల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
ఏమైందంటే?
ప్రధాని మోదీ బుధవారం.. పంజాబ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. "కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ.. సభా వేదికపై ప్రకటించారు. అయితే.. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా లోపాల్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని, దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి:
మోదీ పంజాబ్ టూర్‌కు నిరసనకారుల బ్రేక్- 20 నిమిషాలు ఫ్లైఓవర్‌పైనే!
మోదీ ర్యాలీ రద్దుపై మాటల యుద్ధం.. 'ఫ్లాప్ షో అని తెలిసే ఇలా..'