గుజరాత్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గాంధీనగర్‌లో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్లో ఫైవ్ స్టార్ హోటల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పట్టణాభివృద్ధిలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని మోదీ స్పష్టం చేశారు.
" దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఎంతో కీలకం. అందుకు ఆధునీకరించిన గాంధీనగర్ రైల్వేస్టేషన్ ఓ ఉదాహరణ. ఆధునిక సాంకేతికత వినియోగానికి ఇది నిదర్శనం. అన్ని రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన వివిధ దశల్లో ఉంది. దేశంలోని ప్రతి ప్రాంతానికి రైల్వే సేవలు చేరటం ద్వారా ఆత్మనిర్భరత వృద్ధి చెందుతుంది. రైల్వేలో భద్రత, వేగం, పరిశుభ్రత, సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రైళ్లు ప్రయాణిస్తాయి."
-- ప్రధాని నరేంద్ర మోదీ
కరోనా సంక్షోభాన్ని గుజరాత్ అధిగమించిందని మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు త్రీటీ ఫార్ములాను అనుసరించాలని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
దేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధే అజెండాగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించారు. ప్రపంచ స్థాయిలో ప్రయాణికులకు సదుపాయాలు ఏర్పాటు చేయటం సహా రైల్వేస్టేషన్‌పై 5 నక్షత్రాల హోటల్‌ను నిర్మించారు. ఈ హోటల్ నిర్మాణంతో గాంధీనగర్ రైల్వేస్టేషన్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇదీ చదవండి : రూ.1,100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన