జనవరి 3 నుంచి వారికి వ్యాక్సిన్..
PM Narendra Modi: ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10వ తేదీ నుంచి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందిస్తామని ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ చేస్తామని చెప్పారు.
అలాగే, జనవరి 10 నుంచే 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు వేస్తామన్నారు.
శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ''దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తాం'' అని మోదీ అన్నారు.