మాజీ ఉపప్రధాని... భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ 94వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, పార్టీకి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. 94వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న అడ్వాణీ.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్వాణీ నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అడ్వాణీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనతో కేక్ కట్ చేయించారు.
"జన్మదిన శుభాకాంక్షలు అడ్వాణీ జీ. శేష జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. దేశాన్ని శక్తిమంతం చేయడానికి, మన సంస్కృతిని పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు దేశం రుణపడి ఉంది. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, తెలివైనవారు."
- ప్రధాని నరేంద్ర మోదీ
అడ్వాణీ 94వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అడ్వాణీని ఎంతో మందికి స్ఫూర్తిగా, మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. తన పాండిత్యం, దూరదృష్టి, తెలివితేటలతో అత్యంత గౌరవనీయమైన నాయకుల్లో ఒకరిగా అడ్వాణీ గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
ఎల్‌కే అడ్వాణీ 1927 నవంబరు 8న కరాచీలో జన్మించారు. భారత్ విభజన తర్వాత అడ్వాణీ కుటుంబం భారత్‌లో స్థిరపడింది. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో అటల్ బిహారీ వాజ్‌పేయీతోపాటు ఈయన కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఈయనే. జాతీయ రాజకీయాల్లో పార్టీ ఎదుగుదలకు అడ్వాణీ చాలా కృషి చేశారు.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: బాపూను బతికించి.. తాను కష్టాలకోర్చి..