కరోనా రెండో దశలో ప్రాణవాయువుకు తీవ్రమైన కొరత ఏర్పడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1,500 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఆక్సిజన్ లభ్యత, సరఫరా సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పీఎం కేర్స్ నిధుల ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
"వీలైనంత త్వరగా ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మోదీ ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా పనిచేయాలని తెలిపారు. పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు చేసే ఈ ఆక్సిజన్ ప్లాంట్లను రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. వీటి ద్వారా దేశంలో దేశంలో 4 లక్షలకుపైగా ఆక్సిజన్ పడకలకు ప్రాణవాయువు సరఫరా చేయవచ్చు."
-ప్రధానమంత్రి కార్యాలయం
ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ఆయా ఆసుపత్రుల్లోని 8 వేల మంది సిబ్బందికి నిపుణులతో శిక్షణ ఇవ్వాలని అధికారులకు మోదీ సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును తెలుసుకునేందుకు అత్యాధునిక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు.
అయితే... ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును పర్యవేక్షించేందుకు ఐఓటీ సాంకేతికతను తాము ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పరీక్షిస్తున్నామని మోదీకి అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో తాము సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి: ట్విట్టర్ యూజర్‌కు మోదీ బర్త్‌డే విషెస్- నెటిజన్ల ఆశ్చర్యం