Modi reviews Covid situation: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 పరిస్థితులపై ఆరా తీశారు. కొవిడ్ విజృంభణపై సమీక్షించిన మోదీ.. నియంత్రణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఒమిక్రాన్ కారణంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ.. జిల్లాస్థాయిలో ఆరోగ్య రంగంలో అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. 15-18 ఏళ్ల వయస్కులకు.. కొవిడ్ టీకాల పంపిణీ వేగవంతం చేయాలని చెప్పారు.
వైరస్ రూపాలు మార్చుకుంటున్న నేపథ్యంలో.. జీనోమ్ సీక్వెన్సింగ్, ఫార్మా సంస్థల ప్రయోగాలతో పాటు పరీక్షలు, టీకాలపై.. నిరంతరం శాస్త్రీయ పరిశోధనలు జరగాలని అభిప్రాయపడ్డారు మోదీ. ఈ మేరకు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
మాస్కులు, భౌతిక దూరం పాటించడం సహా లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి.. హోం ఐసోలేషన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ప్రధాని సూచించినట్లు తెలిపింది. రాష్ట్రాల వారీగా కొవిడ్ పరిస్థితులు, అనుసరిస్తున్న విధానాలు, ప్రజారోగ్య విభాగాల స్పందనలను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, హోం శాఖ సెక్రటరీ, రైల్వే బోర్డు సీఈఓ సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ వర్చువల్ విధానంలో జరిగింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర వైద్య మంత్రి. కరోనా కట్టడి సహా వ్యాక్సినేషన్‌పై సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Pregnant women: కేంద్రం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వారికి ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Coronavirus Update: భారత్‌లో శనివారం ఒక్కరోజే లక్షా 59 వేల 632 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 224 రోజుల్లో ఇవే అత్యధికం. చివరిగా గతేడాది మే 29న 1,65,553 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం- వారికి మాత్రమే వర్క్ ఫ్రం హోం!