శ్రీరామచంద్రుడు నడయాడిన అయోధ్య నగరంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీపాల వెలుగుల్లో చారిత్రక అయోధ్య నగరం వెలుగులీనుతోంది. దీపావళి పర్వదిన సంబరాల్లో భాగంగా సరయు నది తీరాన దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించే కార్యక్రమం కొనసాగుతోంది.
![PM Modi offers prayers to Ram Lalla in Ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16728830_2.jpg)
![PM Modi offers prayers to Ram Lalla in Ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16728830_3.jpg)
అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. శ్రీరామచంద్రుడి మాటలు, ఆలోచనలు, పరిపాలన విలువలే 'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్'కు ప్రేరణ అని మోదీ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ తర్వాత మోదీ అయోధ్యకు రావడం ఇదే తొలిసారి. అయోధ్యకు రాగానే ముందుగా మోదీ రామ జన్మభూమిలో రామ్‌లల్లాకు.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మట్టి ప్రమిదను వెలిగించి హారతి ఇచ్చారు. రామ మందిర నిర్మాణ పనులను కూడా ప్రధాని పరిశీలించారు. అనంతరం రాముడికి మోదీ లాంఛనప్రాయ పట్టాభిషేకం చేశారు. సరయు తీరంలో హారతిలో పాల్గొన్నారు.
అయోధ్యలో జరిగే దీపోత్సవ్‌లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగిస్తున్నారు. సరయు నది ఒడ్డున 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తుండగా.. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగించారు. ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.