కరోనాపై నిర్లక్ష్యం తగదు
మంత్రిమండలితో భేటీ సందర్భంగా కరోనా నిబంధనల ఉల్లంఘనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజలు గుమిగూడిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా ప్రజలు తిరుగుతున్నారని.. ఇది మంచిది కాదని అన్నారు.
కరోనాపై చేస్తున్న పోరులో చిన్న తప్పు కూడా.. తీవ్రమైన ప్రభావం చూపుతుందని మోదీ పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి అసలు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రజలందరినీ కరోనా నిబంధనలు పాటించేలా మంత్రులందరూ చర్యలు తీసుకోవాలని సూచించారు.
"ఇంతకుముందుతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల.. ప్రజలు బయటకు వెళ్లాలని భావిస్తున్నారు. కానీ, కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని అందరూ గుర్తుంచుకోవాలి. చాలా దేశాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ మ్యూటేషన్ చెందుతోంది."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ